Answer:
ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. సా. శ. 2011 లో ఈ భూలోకం జనాభా 7 బిలియనులు (7,000,000,000) అయితే 5 బిలియనుల సెల్ ఫోనులు వాడకంలో ఉండేవిట! ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి 2011 వరకు మొబైల్ ఫోన్ల వినియోగదారులు 12.4 మిలియన్ల నుండి 6 బిలియన్లకు ఎగబాకింది. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమనగా ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతీవ్యక్తికి ఈ మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరి సాధనం అయేయి.
ముందుగా కొన్ని నిర్వచనాలతో మొదలు పెడదాం.
"ంమొబైల్ ఫోన్ " అనే ఇంగ్లీషు మాటని తెలుగులో దూరవాణి అంటున్నారు. "టెలి" అంటే దూరం, "ఫోన్" అంటే శబ్దం కనుక ఈ దూరవాణి అనే పేరు అర్థవంతంగానే ఉంది. పూర్వకాలంలో ఈ టెలిఫోనులు గోడకి తగిలించో, బల్ల మీదనో, కదలకుండా ఒక చోట పడి ఉండేవి. కనుక ఫోనులో మాట్లాడాలంటే మనం ఫోను దగ్గరకి వెళ్లాల్సి వచ్చేది.
దరిమిలా ఫోనుని ఎక్కడకి పెడితే అక్కడకి చేత్తో పట్టుకుపోయే సౌకర్యం మొట్టమొదట జపానులోని టోకియో నగరంలో, 1979 లో, వచ్చింది. ఈ రకం టెలిఫోనుని ఇంగ్లీషులో "మొబైల్ ఫోన్" అనడం మొదలు పెట్టేరు. "మొబైల్" అంటే తేలికగా కదలగలిగేది లేదా చలించగలిగేది. కనుక ఈ జాతి టెలిఫోనులని న్యాయంగా "చలన వాణి" అనో "చలవాణి" అనో అనాలి. 'చర' అనగా కదలునది. దీనిని తెలుగులో "చరవాణి" అంటున్నారు. తీగలతో గోడకి అతుక్కుపోకుండా విశృంఖలంగా ఉండే సదుపాయం ఉంది కనుక వీటిని నిస్తంతి ("వైర్లెస్") పరికరాలు అని కూడా అననొచ్చు. టోకియోలో జరిగిన ప్రయోగం విజయవంతం అవడంతో ఈ పద్ధతి ఐరోపా లోని కొన్ని దేశాలలో వ్యాపించింది. చివరికి 1983 లో మోటరోలా కంపెనీ అమెరికాలో ఈ రకం టెలిఫోనులకి ప్రాచుర్యం కల్పించింది. అప్పుడు దీని బరువు 2.2 పౌండ్లు (1 kg). అమెరికాలో పట్టణాలు విశాలమైన జాగాలలో విస్తరించి ఉండడం వల్ల, కారుల వాడకం ఎక్కువ అవడం వల్ల ఈ చేతిలో ఇమిడే టెలిఫోనులు ఇల్లు దాటి చాల దూరం వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితులకి అనుకూలంగా ఉండాలని మోటరోలా కంపెనీ, తేనెపట్టులో గదుల మాదిరి, ఒక నిస్తంతి వలయం (సెల్యులార్ నెట్వర్క్) రూపొందించి, ఆ వలయంలో ఈ టెలిఫోనులు పనిచేసే సాంకేతిక వాతావరణం సృష్టించింది. అందుకని, అప్పటినుండి అమెరికాలో ఈ చరవాణిని "సెల్యులార్ ఫోన్" అనిన్నీ, "సెల్ ఫోన్" అనిన్నీ, చివరికి "సెల్" అనిన్నీ పిలవడం మొదలు పెట్టేరు. ఈ సాంకేతిక పరిధిని మొదటి తరం (1G or First Generation) అని కూడా అంటారు.
తరువాత ఫిన్లండులో, 1991లో, రెండవ తరం (2G) ఫోనులు వచ్చేయి. అటు పిమ్మట 2001 లో మూడవ తరం (3G), తరువాత అంచెలంచెల మీద నాలుగవ తరం (4G) ఫోనులు వాడుకలోకి వచ్చేయి. ఈ తరాల మార్పుతో సరితూగుతూ కొత్త కొత్త వెసులుబాట్లు ("ఫీచర్స్") తో ఫోనులు బజారులోకి వస్తున్నాయి. ఎన్ని తరాలు మారినా, కొన్ని కనీస అవసరాలకి ఆసరగా ఈ చరవాణిలో కొన్ని వెసులుబాట్లు ఉంటూ వచ్చేయి:
చరవాణి పని చెయ్యడానికి అత్యవసరమైన విద్యుత్తుని సరఫరా చెయ్యడానికి లిథియం అణుశకలాలతో పనిచేసే ఒక విద్యుత్ ఘటం (Lithium-ion battery cell).
చేతిలో ఇమిడే అంత చిన్న చరవాణిలో టెలిఫోను నంబర్లు ఎక్కించడానికి కావలసిన మీటల ఫలకం ("కీ బోర్డ్") ఇమడ్చడానికి చోటు సరిపోదు. అందుకని స్పర్శతో స్పందించ గలిగే స్పర్శ ఫలకం లేదా తాకు తెర ("టచ్ పేడ్") కావలసి వచ్చింది.
మన ఫోను నుండి ఇతరుల ఫోనులకి చేరుకోడానికి ఒక మార్గం సృష్టించడానికి ఒక "మధ్యవర్తి" ఉండాలి. ఈ మధ్యవర్తిని "సెల్యులార్ ఆపరేటర్" అంటారు. ఫోను వాడకానికి మనం రుసుం చెల్లిస్తే ఈ మధ్యవర్తి వాడుకరులకి ఒక "సిం కార్డ్" (SIM Card or Subscriber Identity Module card) ఇస్తాడు. ఈ సిం కార్డ్ ని చరవాణి లోపలికి దోపితే చరవాణి ప్రాణం పుంజుకుని పని చెయ్యడం మొదలు పెడుతుంది. సిం కార్డుల యొక్క సైజు తపాలా బిల్లా అంత ఉంటుంది. సిం కార్డులకు కూడా ఇండియాలో చాలా "సెల్యులార్ ఆపరేటర్" కంపెనీలు ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని ముఖ్యమైనవి ఎయిర్టెల్, డొకమో, వోడాఫోన్ మొదలైనవి.